cuddapah: జగన్ పతనం కడప నుంచే ప్రారంభం కావాలి: సీఎం చంద్రబాబు
- జగన్ పార్టీకి ఓట్లు వేయాలా?
- ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలి
- నన్ను, టీడీపీని ఆశీర్వదించాలి
వైసీపీ అధినేత జగన్ పతనం కడప జిల్లా నుంచే ప్రారంభం కావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కడపలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్న కేసీఆర్, మోదీతో లాలూచీ పడుతున్న జగన్ పార్టీకి ఓట్లు వేయాలా? అని ప్రశ్నించారు.
రేపటి ఎన్నికల్లో అన్ని పార్లమెంట్ స్థానాలను, అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే దేశానికి ఓ సంకేతం వెళుతుందని, ఇలాంటి లాలూచీ పార్టీలకు బుద్ధి వస్తుందని ప్రజలకు సూచించారు. అందుకే, ‘నన్ను, టీడీపీని ఆశీర్వదించాలి’ అని కోరుతున్నానని అన్నారు. విభేదాలున్న వారిని కలిపే పార్టీ టీడీపీ అయితే, చిచ్చు పెట్టే పార్టీ వైసీపీ అని విమర్శించారు. ఓటు వేసే విషయంలో కులం, మతం, ప్రాంతం చూసుకోవద్దు, జగన్ లాంటి వాళ్లే కాదు.. పులివెందులలో ఉన్న రాక్షసరాజ్యం కూడా మనకొద్దని అన్నారు.
ఈ సందర్భంగా తనను విమర్శించిన జగన్ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ (పీకే)పై ఆయన నిప్పులు చెరిగారు. బీహార్ డెకాయిట్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ‘నాకు ఎందుకు ఓటు వేయాలి?’ అని పీకే అంటున్నాడని, బీహార్ లో, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆయన తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ‘ఫారం-7’ దొంగలను వదిలిపెట్టమని, జైలుకు పంపిస్తామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.