Telangana: పథకాల పేర్లు మారతాయే తప్ప ప్రజల తలరాతలు మారవు!: బీజేపీ, కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్
- ఈ దేశంలో ఇప్పటి దాకా జరగాల్సింది జరగలేదు
- ఈ పార్టీలు ప్రజలు కేంద్ర బిందువుగా పని చేయలేదు
- నేను తప్పుగా మాట్లాడినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధికారంలో పథకాల పేర్లు మారతాయే తప్ప ప్రజల తలరాతలు మారవని ఆ రెండు పార్టీలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నిజామాబాద్ లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో కొస్తే ఒక్క పని మాత్రం కచ్చితంగా చేస్తుందని, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పేరుతో, అదే, బీజేపీ అయితే, దీన్ దయాళ్, శ్యాంప్రసాద్ ముఖర్జీల పేర్లతో పథకాలు మాత్రం పెడతారని విమర్శించారు.
ఈ పథకాలతో ప్రజల తలరాతలు మారవని, వారికి మంచి చేయరని, ఈ దేశంలో ఇప్పటి దాకా జరగాల్సింది జరగలేదని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ప్రజలు కేంద్ర బిందువుగా పని చేయలేదని, బ్రిటిష్ కాలం నాటి విధానాలను పట్టుకుని కేంద్రీకృతం చేస్తున్నారని, రాష్ట్రాల హక్కులను కూడా హరించేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాను తప్పుగా మాట్లాడినట్టు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, ఉన్న వాస్తవాలు మాట్లాడటం తప్పా? అని ప్రశ్నించారు.