Arunachal Pradesh: బీజేపీకి బిగ్ షాక్... అరుణాచల్ లో ఒకేసారి పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలు
- అరుణాచల్‌ప్రదేశ్‌లో కమలనాథులకు ఎదురు దెబ్బ
- టికెట్లు కేటాయించని వారంతా పార్టీ ఫిరాయింపు
- ఎన్పీపీలో చేరిన అసమ్మతి నేతలు
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాచేసి విపక్ష నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)లో చేరిపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్‌సభతోపాటు అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అరవై అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రేమ్ ఖండు నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది.
రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా కమలనాథులు వ్యూహ రచన చేస్తున్నారు. దీంతో వివిధ రకాల ఆరోపణలు, గెలిచే అవకాశాలులేని సిట్టింగ్‌లను అధిష్ఠానం పక్కనపెట్టింది. ఇలా టికెట్లు రానివారు మొత్తం 12 మంది ఉండగా అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉండడం విశేషం. అయితే అధిష్ఠానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేని వీరంతా తిరుగుబాటు చేశారు. మూకుమ్మడిగా రాజీనామా చేసి ఎన్పీపీలో చేరిపోయి బీజేపీ అధిష్ఠానానికి గట్టి షాక్ ఇచ్చారు.