Telangana: ‘అమీర్ పేట-హైటెక్ సిటీ’ మెట్రో సర్వీస్ ప్రారంభం!
- జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ నరసింహన్
- సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ప్రయోజనకరం
- ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి అందుబాటులోకి
హైదరాబాదీల కల అయిన మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తాజాగా అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అమీర్ పేట స్టేషన్ లో జెండా ఊపి ఈ రూట్లో మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ మార్గంలో సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
దీనివల్ల ఐటీ ఉద్యోగులకు బాగా ప్రయోజనం చేకూరుతుంది. ఇకపై నాగోల్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించొచ్చు. ఎల్బీనగర్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్‌పేట్‌లో రైలు మారాల్సి ఉంటుంది.
దాదాపు 10 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో అమీర్‌పేటతో పాటు మధురానగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెం.5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ స్టేషన్లు ఉన్నాయి. అయితే ఇంకా పనులు సాగుతుండటంతో వీటిలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు.