Jagan: జగన్కు కేసీఆర్, బీజేపీ ఎన్నికల నిధులు: మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపణలు
- ఇప్పటికే కేసీఆర్ రూ.500 కోట్లు ఇచ్చారు
- రూ.2 వేల కోట్లు ఇవ్వనున్న బీజేపీ
- ఈ పది రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్, భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికల నిధులు పుష్కలంగా అందుతున్నాయని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. డబ్బు గుమ్మరించి ఓట్లు కొనాలని వైసీపీ ప్రయత్నిస్తున్నందున ఈ పది రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పటికే కేసీఆర్ 500 కోట్ల రూపాయలు అందజేయగా, 2 వేల కోట్ల రూపాయలు పంపేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోందని చెప్పారు. గెలవలేమన్న భయంతో జగన్ తెలంగాణలో ఆస్తులున్న టీడీపీ అభ్యర్థులను కేసీఆర్తో కలిసి భయపెడుతున్నారని ధ్వజమెత్తారు.
డెల్టాలో పర్యటించే అర్హత జగన్కు లేదని, పదేళ్లుగా అనేక కష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు పట్టిసీమ ద్వారా 13 లక్షల ఎకరాలకు నీరందించి తెలుగుదేశం ప్రభుత్వం వారిని ఆదుకుందని చెప్పారు. వై.ఎస్.వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు వస్తాయనే సిట్ విచారణను జగన్ వ్యతిరేకిస్తున్నారని, సీబీఐ అయితే మోదీ ఆదుకుంటాడని ఆయన నమ్మకమని ఎద్దేవా చేశారు.