Andhra Pradesh: ప్రతిపక్షాలు చెబితేనే పెన్షన్ రూ.1,000 చేశానా?.. వాళ్లు చెబితేనే రూ.2 వేలకు పెంచానా?: చంద్రబాబు ఆగ్రహం
- ఏదైనా చేయాలంటే విజన్ ప్లానింగ్ ఉండాలి
- పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేశా
- సంపదను సృష్టించి రూ.2 వేలు పెన్షన్ ఇస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ రూ.2,000కు పెంచితే తమ పథకాన్ని కాపీ కొట్టామని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. కేవలం రూ.200గా ఉన్న పెన్షన్ ను రూ.వెయ్యికి ప్రతిపక్షాలు చెబితేనే పెంచామా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చెప్పినందుకు తాను పెన్షన్ ను రూ.2 వేలకు పెంచలేదని స్పష్టం చేశారు.
పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలుచేశామని చంద్రబాబు తెలిపారు. తనకున్న అనుభవంతో సంపదను సృష్టించానని వ్యాఖ్యానించారు. అప్పులు తగ్గించి ఆత్మగౌరవం పెరిగేలా కృషి చేశానని చెప్పారు. కాబట్టే పెన్షన్ ను రూ.2,000కు పెంచగలిగామని స్పష్టం చేశారు.
ఏదైనా మాట చెబితే ఆచరించడానికి ప్లానింగ్ ఉండాలనీ, విజన్ కావాలని చంద్రబాబు చెప్పారు. అన్నింటికీ మించి నిజాయతీ ఉండాలన్నారు. కేవలం గాలిమాటలు చెబితే నమ్మేవారెవరూ లేరన్నారు. విజన్, ప్లానింగ్ నిజాయతీ తమకు ఉన్నాయి కాబట్టే ఏపీలో సంక్షేమం దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. ‘మీ సంక్షేమానికి నాది భరోసా, మీ భవిష్యత్తు నా బాధ్యత’ అని హామీ ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.