Andhra Pradesh: పవన్ కల్యాణ్ నా ఫోన్ కాల్స్ ఎత్తేవాడు కాదు.. ఎందుకొచ్చిందిలే అని భావించేవాడు!: నవ్వులు పూయించిన నాగబాబు
- ప్రజారాజ్యం తర్వాత రాజకీయాలకు దూరమయ్యా
- పవన్, నాకు మధ్య వయసులో వ్యత్యాసం ఉంది
- ముద్దుముద్దుగా ఉన్న పవన్, గొప్ప నాయకుడిగా మారాడు
రాజకీయాల్లోకి రావాలని తనకు చాలా కోరికగా ఉండేదని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత వాటన్నింటిని వదిలేశానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినా తాను దూరంగానే ఉన్నానని చెప్పారు. తమ్ముడిని తమ్ముడిగా కాకుండా నాయకుడిగా చూడాలని తాను భావించానన్నారు. పవన్ కల్యాణ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న నేత అని పేర్కొన్నారు.
నాగబాబు ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు, తనకు వయసులో చాలా వ్యత్యాసం ఉందనీ, ఆయన్ను తాను ఎత్తుకుని ఆడించానని నాగబాబు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో క్యూట్ గా, ముద్దుముద్దుగా ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు గొప్ప నాయకుడిగా మారాడని ప్రశంసించారు.
పవన్ కల్యాణ్ విషయంలో ఇన్ వాల్వ్ కాకూడదని తమ ఫ్యామిలీ ఓ అవగాహనకు వచ్చిందన్నారు. పవన్ గతంలో తన ఫోన్లను ఎత్తేవాడు కాదనీ, ఎందుకొచ్చిందిలే అని భావించేవాడని చెప్పి, నవ్వులు పూయించారు. నరసాపురం లోక్ సభ స్థానాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నాగబాబుకు కేటాయించిన సంగతి తెలిసిందే.