prakasam: అలకబూనిన వైవీ సుబ్బారెడ్డి విదేశాలకు వెళ్లారట!
- ఎంపీ స్థానం దక్కకపోవడంపై సుబ్బారెడ్డి మనస్తాపం
- టంగుటూరులో జగన్ సభకు హాజరు కాని వైనం
- విదేశాలకు వెళ్లారని చెబుతున్న సుబ్బారెడ్డి వర్గీయులు
త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా వైసీపీ నేత వై.వి.సుబ్బారెడ్డికి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కకపోవడం తెలిసిందే. ఈ అవకాశం తనకు లభించకపోవడంతో సుబ్బారెడ్డి మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. అందుకే, వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం లేదట. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారని సమాచారం.
టంగుటూరులో వైసీపీ అధినేత జగన్ ఈ రోజు నిర్వహించిన సభకూ ఆయన హాజరుకాలేదు. ఒంగోలు నియోజకవర్గం నుంచి తనకు చెప్పకుండానే తనను తప్పించారని అలిగిన సుబ్బారెడ్డి విదేశాలకు వెళ్లారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సుబ్బారెడ్డి వర్గీయులు కూడా వైసీపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్టు సమాచారం.
కాగా, ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డి ‘ప్రత్యేక హోదా’ సాధన నేపథ్యంలో ఆ పదవికి గతంలో రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం తనకే లభిస్తుందని సుబ్బారెడ్డి అనుకున్నారు. అందుకు భిన్నంగా, వైసీపీ తరపున మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఇక్కడి నుంచి బరిలోకి దింపారు.