punith raj kumar: నేను రాజకీయాలకు దూరం.. ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు: కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్
- రసవత్తరంగా మారిన మాండ్యా పోరు
- పరస్పరం పోటీ పడుతున్న సుమలత-నిఖిల్
- తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తానన్న పునీత్ రాజ్‌కుమార్
కర్ణాటకలోని మాండ్యా స్థానం భలే రసవత్తరంగా మారింది. ఈ స్థానం నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి అంబరీష్ భార్య సుమలతకు కాంగ్రెస్ మొండిచేయి చూపింది. జేడీఎస్-కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, సినీ నటుడు నిఖిల్‌కు కేటాయించింది. ఒకే స్థానం నుంచి చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీపడుతుండడంతో ఇక్కడ హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నారు.
కాగా, సినీ ప్రముఖులు తలపడుతున్న ఈ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సినీ ప్రముఖులు కొందరు ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయారు. సుమలతకు కొందరు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు దూరమని, ఎవరి తరపునా ప్రచారం చేయబోనని స్పష్టం చేశారు. సుమలతకు మద్దతు పలుకుతున్న నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. పునీత్ రాజ్‌కుమార్ మద్దతు తమకుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. రాజకీయాలకు తన తండ్రి దూరంగా ఉండేవారని, ఆయన ఆదర్శాల మేరకు తాను కూడా వాటికి దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. సుమలతకు మద్దతు ఇవ్వడం లేదని, ఆమె ప్రచారాలకు తాను వెళ్లడం లేదని పేర్కొన్నారు.