Chennai Super Kings: కన్నీరు పెట్టుకున్న మహేంద్ర సింగ్ ధోనీ!
- చెన్నై సూపర్ కింగ్స్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు
- రెండేళ్లపాటు నిషేధంతో బాధపడిన ధోనీ
- 'రోర్ ఆఫ్ ద లయన్'లో చెన్నై భావోద్వేగం
మిస్టర్ కూల్ గా భావిస్తూ, అభిమానులు ఎంతో ఆరాధించే భారత క్రికెట్ ఆటగాడు, ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కన్నీరు పెట్టుకున్నారు. ఎప్పుడని అనుకుంటున్నారా? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చి, ఆపై రెండేళ్ల నిషేధం తరువాత, తిరిగి నిర్వహించిన జట్టు సమావేశంలో. ఈ మీటింగ్ లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోయిన తన నోటి నుంచి మాటలు రాలేదని, తన కళ్లలో నుంచి నీరు వచ్చిందని ధోనీ స్వయంగా చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై హాట్ స్టార్ ఐదు ఎపిసోడ్ల 'రోర్ ఆఫ్ ద లయన్' పేరిట ఓ డాక్యుమెంటరీని విడుదల చేయగా, దానిలో ధోనీ మాట్లాడాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులోకి తనను కూడా లాగాలని చూశారని ఆరోపించిన ధోనీ, ఆ సమయంలో ఎక్కడ చూసినా తన జట్టుపైనే చర్చ జరుగుతూ ఉండేదని, చేసింది ఫ్రాంచైజీ యజమాని కూడా కాదని, ఆయన అల్లుడని అన్నాడు. దీనికి జట్టుపై అంత శిక్ష వేస్తారా? అని ధోనీ ప్రశ్నించాడు.
సూపర్ కింగ్స్ తో తన అనుబంధం పెద్దలు కుదిర్చిన పెళ్లి వంటిదని వ్యాఖ్యానించిన ధోనీ, తానేమీ ఆ జట్టు కావాలని కోరుకోలేదని, ఫ్రాంఛైజీయే తనను ఏరి కోరి జట్టులోకి తీసుకుని నాయకత్వ బాధ్యతలను అప్పగించిందని అన్నాడు. ఆ క్షణం నుంచే తనకు చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఎల్లవేళలా అభిమానులు తమకు అండగా నిలిచారని చెప్పాడు. రెండు సంవత్సరాల నిషేధం తమకన్నా అభిమానులనే అధికంగా కలచివేసిందని, చెన్నై ఫ్యాన్స్ లో ఎంతో మంది ఈ రెండు సంవత్సరాలూ ఐపీఎల్ మ్యాచ్ లనే చూడలేదని ధోనీ చెప్పుకొచ్చాడు.