New zealand: న్యూజిలాండ్ సంచలన నిర్ణయం.. సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల విక్రయాలపై నిషేధం
- గతవారం క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో కాల్పులు
- 50 మంది మృతి
- నిషేధిత ఆయుధాలు కలిగిన వారి కోసం బైబ్యాక్ స్కీం
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదులో జరిగిన నరమేధం తర్వాత న్యూజిలాండ్ ప్రభుత్వం కళ్లు తెరిచింది. అసాల్ట్ రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల విక్రయాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటించారు. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
గతవారం క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన జరిగిన వారం తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెమీ ఆటోమెటిక్ రివాల్వర్లతోపాటు దుండగుడు ఉపయోగించిన అన్ని రకాల మారణాయుధాలపైనా నిషేధం విధించింది. అంతేకాదు.. ఇప్పటికే ఈ ఆయుధాలు కలిగిన వారి కోసం బైబ్యాక్ స్కీంను కూడా ప్రవేశపెట్టినట్టు ప్రధాని తెలిపారు.