ys viveka: తానెంతో నమ్మిన అనుచరుల చేతుల్లోనే హతం... వైఎస్ వివేకా హత్య కేసును కొలిక్కి తెచ్చిన సిట్!
- హత్యకు పాల్పడింది చంద్రశేఖర్ రెడ్డి గ్యాంగ్
- వెనకున్నది పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి
- అరెస్ట్ లను అధికారికంగా చూపించే అవకాశం
సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఓ కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సూత్రధారులు కాగా, చంద్రశేఖర్ రెడ్డి అతని గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్టు సిట్ తేల్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆస్తి వివాదాల కారణంగా ఆయన నమ్మిన అనుచరులే చంపేశారన్న అంశాన్ని సిట్ దర్యాఫ్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. గురువారం నాడు కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, వీరు విచారణకు కీలకమని అధికారులు అంటున్నారు. వీరు వినియోగించిన ఓ స్కార్పియో వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం ఇప్పటికే 40 మందిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. హత్య తరువాత గంగిరెడ్డి ఆధారాలను తొలగించే ప్రయత్నం చేశాడని కూడా సిట్ అధికారులు తేల్చారు. ఒకటి రెండు రోజుల్లోనే కేసు వివరాలను అధికారికంగా వెల్లడిస్తూ, అరెస్ట్ లను అధికారికంగా చూపించవచ్చని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.