Social Media: యూట్యూబ్ యుద్ధంలో విజేత టి-సిరీస్.. రికార్డు స్థాయిలో సబ్ స్క్రయిబర్లు
- అత్యధిక స్క్రయిబర్లను సొంతం చేసుకున్న టి-సిరీస్
- రెండో స్థానానికి పడిపోయిన ప్యూడైపై
- హోరాహోరీగా సాగిన ఆన్ లైన్ యుద్ధం
కొంతకాలంగా యూట్యూబ్ ట్రెండ్స్ ను పరిశీలిస్తున్న వారికి టి-సిరీస్, ప్యూడైపై చానళ్ల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఎవరికి ఎక్కువమంది సబ్ స్క్రయిబర్లు లభిస్తారో చూసుకుందాం అంటూ ఈ రెండు యూట్యూబ్ చానళ్లు ఆన్ లైన్ వేదికగా కత్తులు దూశాయి. అయితే ఈ పోరాటంలో భారతీయ మ్యూజిక్ కంపెనీ టి-సిరీస్ ఘనవిజయం సాధించింది.
ఇప్పుడు టి-సిరీస్ యూట్యూబ్ చానల్ కు 90.49 మిలియన్ల మంది సబ్ స్క్రయిబర్లు ఉండగా, ప్యూడైపై ఖాతాలో రూ.90.47 మిలియన్ల మందే ఉన్నారు. టి-సిరీస్ కోసం సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహాం, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్ వంటి బడా హీరోలు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేశారంటే మేనియా ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా టి-సిరీస్ తన పంతం నెగ్గించుకుని స్వీడిష్ చానల్ ప్యూడైపైని వెనక్కినెట్టింది. అందుకోసం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేపట్టి సఫలం అయింది.