India: భారత్ లో ఎవరు గెలిచినా సత్సంబంధాలు కొనసాగుతాయ్!: అమెరికా
- ఎన్నికల అనంతరం సంబంధాలు బలపడుతాయి
- భారత్ అమెరికాకు వ్యూహాత్మకంగా కీలకమైన దేశం
- వైట్ హౌస్ ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా భారత్ తో అమెరికా సత్సంబంధాలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ తెలిపింది. ఎన్నికల అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆకాంక్షించింది. మోదీ హయాంలో ఇండియా-అమెరికా మధ్య సంబంధాలు బలపడ్డాయని వ్యాఖ్యానించింది.
ఈ విషయమై వైట్ హౌస్ కు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. గతేడాది ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు జరిపిన (2 ప్లస్ 2) చర్చలు ఇండియా-అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేశాయన్నారు.
2017లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడం కూడా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు దోహదం చేసిందన్నారు. అంతేకాకుండా భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు బోల్టన్, విదేశాంగ మంత్రి పాంపియోతో సమావేశమై కీలక అంశాలపై చర్చలు జరిపారన్నారు. భారత్ వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా కీలకమైన దేశమని వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ నుంచి తోడ్పాటు అందడంపై దృష్టి సారించామన్నారు.