Pulivendula: ఈ గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నా: పులివెందులలో వైఎస్ జగన్

  • పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్
  • ప్రజల ప్రేమ, ఆప్యాయతలను గుర్తు చేసుకున్న జగన్
  • వైఎస్ ప్రాజెక్టులను టీడీపీ తనవిగా చెప్పుకుంటోందని విమర్శలు

కడప గడ్డపై పుట్టినందుకు తానెంతో గర్వపడుతున్నానని, పులివెందులంటే వైఎస్ కుటుంబానికి ఎంతో ప్రేమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఈ ఉదయం పులివెందుల నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయన, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రాంత ప్రజలు తమ కుటుంబంపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపుతూ వచ్చారని గుర్తు చేసుకున్నారు. కష్టంలోనూ గుండెధైర్యంతో ఎలా ఉండాలో తనకు ఈ గడ్డే నేర్పిందని అన్నారు. వందల నిందలు వేస్తున్నా, కుట్రలు చేస్తున్నా తొణకకుండా, బెదరకుండా, నిబ్బరంగా ఉండటాన్ని కూడా నేర్పించిందని చెప్పారు.

పులివెందులకు కృష్ణా నీరు తెచ్చేందుకు దివంగత మహానేత ప్రాజెక్టులను చేపడితే, జలయజ్ఞం, ధనయజ్ఞం అని విమర్శించిన వారు, ఇప్పుడు నీరు వచ్చేసరికి తామే ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని తెలుగుదేశం టార్గెట్ గా విమర్శించారు. మంచితనానికి విరుద్ధంగా చంద్రబాబు పాలన సాగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. అధికారం కోసం సొంత మామపై కుట్ర చేసి, వెన్నుపోటు పొడిచి చంపేసిన చంద్రబాబు, తన పాలనలో కుప్పంకు కూడా ఏమీ చేయలేదని, ఇప్పుడు పులివెందులకు వచ్చి తానే మంచి చేశానని వితండవాదన చేస్తున్నారని అన్నారు.

పులివెందులలో జేఎన్టీయూ కాలేజీని, ట్రిపుల్ ఐటీ, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, కడప నుంచి పులివెందులకు నాలుగు లైన్ల రహదారి, టీటీడీ ద్వారా అభివృద్ధి, 2,800 కోట్లతో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రతి మండల కేంద్రంలో కాలేజీ, నేషనల్ ఎకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్, పులివెందులకు రింగ్ రోడ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పైడిపాలెం ప్రాజెక్ట్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఎవరి హయాంలో వచ్చాయో చెప్పగలరా? అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. అంతకుముందు వైఎస్ వివేకానందరెడ్డి మరణానికి సంతాపంగా, రెండు నిమిషాలు మౌనం పాటించారు.

  • Loading...

More Telugu News