mohan babu: మోహన్ బాబు చేస్తున్నది విద్యాదానం కాదు.. వ్యాపారం: కుటుంబరావు
- కక్షపూరితంగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు
- వైసీపీకి మద్దతుగా ఎన్నికల సమయంలో రాద్ధాంతం చేస్తున్నారు
- ఐదేళ్లలో రూ. 14,510 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ చేశాం
తన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ తిరుపతిలో నిరసన కార్యక్రమం చేపట్టిన నటుడు మోహన్ బాబుపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. ప్రతిపక్షం వైసీపీకి మద్దతుగానే మోహన్ బాబు నిరసనకు దిగారని మండిపడ్డారు. కక్షపూరితంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రూ. 14,510 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని చెప్పారు. ఎన్నికల వేళ ఆందోళనకు దిగడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడైనా మోహన్ బాబు మాట్లాడారా? అని అన్నారు. వ్యాపార ప్రయోజనాల కోసమే విద్యాసంస్థలను ఆయన నడుపుతున్నారని చెప్పారు.
మోహన్ బాబు విద్యాదానం చేయడం లేదని, కేవలం వ్యాపారం మాత్రమే చేస్తున్నారని కుటుంబరావు ఆరోపించారు. తన కాలేజీలలో విద్యార్థులకు ఫ్రీగా చదువు చెబుతున్నానని, 25 శాతం మంది విద్యార్థులకు ఫీజులు తానే కడుతున్నానని గొప్పలు చెప్పుకుంటుంటారని... అలాంటి వ్యక్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పిన విషయాలపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమేనని చెప్పారు.