Telugudesam: ఎస్వీ మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: టీజీ వెంకటేశ్
- పార్టీని వీడాక విమర్శలేంటి?
- ఎస్వీ ఓ మోనార్క్
- దాడులకు కూడా వెనుకాడరు
సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకు కర్నూలు సీటు ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైన ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి మళ్లీ వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. కర్నూలు టికెట్ ను చంద్రబాబునాయుడు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ కు కేటాయించడం ఎస్వీని రగిలిపోయేలా చేసింది. దాంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు.
అంతేకాదు, తెలుగుదేశం పార్టీపైనా, నేతలపైనా విమర్శలు చేస్తున్నారు. దీనిపై టీజీ వెంకటేశ్ స్పందిస్తూ, పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయాక కూడా విమర్శలు చేయడం సరైందని కాదని ఎస్వీకి హితవు పలికారు. ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి ఓ నియంతలా వ్యవహరించారని, అయినప్పటికీ భరించామని తెలిపారు. కాంట్రాక్టుల్లో పర్సంటేజీ అడిగిన వ్యక్తులపై దాడులకు కూడా వెనుకాడని వ్యక్తి ఎస్వీ మోహన్ రెడ్డి అని టీజీ ఆరోపించారు. టీడీపీని వీడిన తర్వాత కూడా ఇంకా విమర్శలు చేస్తున్న ఎస్వీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీజీ హెచ్చరించారు.