mohanbabu: బకాయిలో రూపాయి తేడావున్నా అంతా మీరే తీసుకోండి...ఇది నాన్నగారి మాట: మంచు మనోజ్ ఛాలెంజ్
- కుటుంబరావు నారా కుటుంబం తరపున వకాల్తా పుచ్చుకుంటున్నారు
- పేద విద్యార్థుల తరపున మాట్లాడాలి
- ఇస్తామని చెప్పి ఇవ్వనందునే డాడీ రోడ్డెక్కారని ట్వీట్
శ్రీవిద్యానికేతన్ సంస్థలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఇంతని మేము చెబుతున్నామని, అందులో రూపాయి తేడావున్నా అసలు మాకు నిధులే ఇవ్వక్కర్లేదని, ఇది తన మాటగా నాన్నగారు చెప్పమన్నారని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని మోహన్ బాబు శుక్రవారం రోడ్డెక్కిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు టీడీపీ నేతలు, ముఖ్యంగా ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబుపై బురద చల్లేందుకు కావాలనే మోహన్‌బాబు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నారా? లేక వ్యాపారం చేస్తున్నారా? అంటూ మండిపడ్డారు.
దీనిపై స్పందించిన మనోజ్ వరుస ట్వీట్లు చేశారు. శ్రీవిద్యానికేతన్‌కు ప్రభుత్వం ఎంత బకాయి ఉందో లెక్కలతో వెల్లడించారు. ఆంధ్రప్రజలకు ఓ లేఖ కూడా రాసి దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఐఏఎస్ రావత్గారికి మా కళాశాలకు రావాల్సిన బకాయి వివరాలు ఇస్తూ లేఖ రాశామని, వారం రోజుల్లో నిధులు చెల్లిస్తామని ఆ సందర్భంలో ఆయన తెలియజేసిన విషయం నాన్నగారు మీకు గుర్తు చేయమన్నారని మనోజ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
కానీ ఆయన చెప్పిన తేదీకి నిధులు రానందున ఈ నెల 2వ తేదీన కళాశాలలో సమావేశం నిర్వహించి డబ్బు అందని విషయం మరో మారు గుర్తు చేశామని, అయినా స్పందించకపోవడం వల్లే నాన్నగారు రోడ్డెక్కాల్సి వచ్చిందని మనోజ్ పేర్కొన్నారు. 'కుటుంబరావు పెద్దమనిషి. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల కుటుంబం తరఫున కాకుండా కేవలం నారా కుటుంబం తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడాలని అనుకోవడం బాధగా ఉంది’ అంటూ మనోజ్ విమర్శించారు.