Pawan Kalyan: ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా?: పవన్ కల్యాణ్
- ఓ వైపు వైసీపీ, టీడీపీ
- మరోవైపు జనసేన, బీఎస్పీ, వామపక్షాలు
- ఎటువైపుండాలో ప్రజలే నిర్ణయించుకోవాలి
- విజయవాడలో పవన్ కల్యాణ్
ఏపీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవతలి గట్టుపై ఉన్నాయని, జనసేన, బీఎస్పీ, వామపక్షాల కూటమి ఇవతలి గట్టుపై ఉన్నాయని, ఏ గట్టున ఉంటారన్న విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పార్టీ జనసేన మాత్రమేనని, కేంద్రాన్ని ప్రశ్నించాలంటే, జగన్ కు భయమని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు తెలుగుదేశం పల్లకీలు మోయాలని ప్రశ్నించారు. తాము రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ పడుతున్నామని గుర్తు చేసిన పవన్, టీఆర్ఎస్, బీజేపీతో వైఎస్ జగన్ జట్టు కట్టారని దుయ్యబట్టారు.
వైఎస్ఆర్ సీపీ అంటే టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ అని అభివర్ణించిన ఆయన, ఏపీకి చెందిన బీసీలను ఒక్క సంతకంతో ఓసీలుగా కేసీఆర్ మార్చారని విమర్శించారు. ఈ విషయంలో జగన్ కూడా కేసీఆర్ ను ప్రశ్నించడం లేదని అన్నారు. రాజకీయాలు వేరని, కుటుంబ సంబంధాలు వేరని చెప్పిన పవన్, తనకు టీఆర్ఎస్ తో బంధం ఉందా? లేదా? అన్న విషయాన్ని జగన్ స్పష్టం చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల తరువాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయేది తానేనని అన్నారు.