BJP: బెంగాల్లో బీజేపీ తరపున బరిలోకి తొలి ముస్లిం మహిళా అభ్యర్థి.. ప్రణబ్ కుమారుడిపై పోటీ
- జంగీపూర్ నుంచి బరిలోకి దిగుతున్న ఖాతూన్
- దక్షిణ దినాజ్‌పూర్ నుంచి రెండుసార్లు సీపీఎం టికెట్‌పై విజయం
- గత ఎన్నికల్లో ఓడి బీజేపీలో చేరిక
పశ్చిమ బెంగాల్లో తొలిసారి ఓ ముస్లింకు బీజేపీ టికెట్ కేటాయించింది. మఫుజా ఖాతూన్ అనే మహిళకు ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్ నియోజకవర్గ టికెట్ కేటాయించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ (59) బరిలో ఉన్నారు.
తనకు టికెట్ కేటాయించడంపై ఖాతూన్ హర్షం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ముస్లిం మహిళల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ వంటి వాటిపై విస్తృత ప్రచారం చేస్తానన్నారు. 47 ఏళ్ల ఖాతూన్ దక్షిణ దినాజ్‌పూర్ నుంచి రెండుసార్లు సీపీఎం తరపున విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఖాతూన్ 2017లో బీజేపీలో చేరారు. బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పనులను టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఖాతూన్ ఆరోపించారు. కాగా, గత ఎన్నికల్లో ముఖర్జీ 8 వేల ఓట్ల తేడాతో సీపీఎం అభ్యర్థిపై విజయం సాధించారు. ఈసారి ఇక్కడి నుంచి స్థానిక వ్యాపారవేత్తను సీపీఎం బరిలోకి దింపింది.