YSRCP: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. హత్య తర్వాత బీరువాలోని రూ.1.20 కోట్లు మాయం?
- వివేకా హత్యకు ముందు పులివెందులలో తచ్చాడిన ముగ్గురు వ్యక్తులు
- హత్య తర్వాత పత్తాలేకుండా పోయిన వైనం
- కిరాయి హంతకుల పనేనని అనుమానం
వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన తర్వాత ఆయన బెడ్రూములోని బీరువాలో ఉన్న రూ.1.20 కోట్లను ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బీరువాపై రక్తపు మరకలు ఉండాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ హత్యలో పక్క రాష్ట్రాలకు చెందిన కిరాయి హంతకుల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హత్యకు సరిగ్గా మూడు రోజుల ముందు ముగ్గురు యువకులు పులివెందులలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించినట్టు చెబుతున్నారు. పులివెందుల బస్టాప్ సమీపంలో వరుసగా మూడు రోజులపాటు వీరు మద్యాన్ని కొనుగోలు చేశారని, వివేకా హత్య తర్వాత వీరు మాయమయ్యారన్న ప్రచారం జరుగుతోంది.
అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ శనివారం వివేకా ఇంటిని పరిశీలించారు. కాగా, వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన బాబావలీతోపాటు మరో ముగ్గురు అనుమానితులను రహస్య ప్రదేశంలో సిట్ వేర్వేరుగా విచారించింది. అనుమానితుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్టు సమాచారం.