Andhra Pradesh: టీడీపీ నేత రాయపాటికి షాక్.. ఇంటిని వేలం వేస్తున్నట్లు ప్రకటించిన ఆంధ్రా బ్యాంకు!
- జూబ్లీహిల్స్ లోని జీప్లస్ 3 వాణిజ్య భవనం
- రూ.7.36 కోట్లు కనీస ధరగా నిర్ధారణ
- ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.748 కోట్లు తీసుకున్న ట్రాన్స్ టాయ్
టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు షాక్ తగిలింది. బ్యాంకు రుణాలను చెల్లించని నేపథ్యంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఇంటిని వేలం వేసేందుకు ఆంధ్రా బ్యాంకు వేలం ప్రకటన జారీచేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–7లో ఉన్న జీ ప్లస్ 3 వాణిజ్య భవనాన్ని రేపు వేలం వేస్తున్నట్లు ఆంధ్రా బ్యాంక్ తెలిపింది. 631 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఈ బిల్డింగ్ కనీస ధరను రూ.7.36 కోట్లుగా నిర్ణయించింది.
రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ బ్యాంకుకు రూ.748.77 కోట్ల రుణాలను బాకీ పడింది. నిర్ణీత గడువులోగా ఈ మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో ఈ రుణానికి గ్యారంటర్లుగా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారులు రాయపాటి రంగారావు, కుమార్తెలు దేవికారాణి, లక్ష్మీలతోపాటు మొత్తం 14 మందికి బ్యాంకు నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ వివిధ బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్లకుపైగా రుణాలను పొందింది. అయితే వీటిని నిర్ణీత గడువులోగా చెల్లించలేకపోయింది.