PUBG: మధ్యలోనే ఆగిపోతున్న పబ్ జీ గేమ్.. క్షమాపణలు చెప్పిన సంస్థ!
- అనారోగ్యం బారిన పడుతున్న ప్లేయర్లు
- గేమ్ ను నిషేధించాలంటూ పెరుగుతున్న డిమాండ్
- నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన పబ్ జీ
వివాదాస్పద పబ్ జీ గేమ్ ఆడుతూ పలువురు అనారోగ్యం బారిన పడుతున్న సంగతి విదితమే. దీంతో ఆ ఆటను నిషేధించాలంటూ డిమాండ్ పెరుగుతోంది. ఇదిలా ఉంచితే, ఈ గేమ్ ఆటగాళ్లకు కొత్త సమస్య ఎదురైంది. ఈ గేమ్ ఆడే సమయం ఆటోమేటిక్ గా పరిమితమైపోతోంది. దాంతో పరిమిత సమయం ముగిసిన తరువాత కూడా యూజర్లు గేమ్ ను ఆడుతుంటే, ఆటోమేటిక్ గా గేమ్ ఆగిపోతుంది.
"మీరు దాదాపు ఆరు గంటల నుంచి గేమ్ ను ఆడుతున్నారు. తిరిగి రేపు ఉదయం 5.30 గంటల తరువాత ఆడండి" అన్న మెసేజ్ ని స్క్రీన్ పై చూపుతూ, తన గేమ్ ను షట్ డౌన్ చేశారని చెబుతూ, ఓ యూజర్ మొబైల్ స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మరికొంతమంది, తాము గంటసేపు ఆడగానే ఇదే తరహా మెసేజ్ లు వస్తున్నాయని వెల్లడించారు.
ఇదే విషయమై పబ్ జీ మొబైల్ ఇండియా స్పందిస్తూ, "మీలో చాలామందికి 'హెల్దీ గేమింగ్ సిస్టమ్' సమస్య వచ్చిందని తెలిసింది. ఇందుకు మేము మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు మా డెవలప్ మెంట్ టీమ్ కృషి చేస్తోంది" అని ట్విట్టర్ లో ప్రకటించింది. అయితే, ఇది సంస్థ టెస్ట్ ఫీచరా? లేక ఏదైనా సాఫ్ట్ వేర్ బగ్గా? లేదా హ్యాకర్స్ సృష్టించినదా? అన్నది స్పష్టంగా తెలియరాలేదు.
We're aware of the "Healthy Gaming System" issue that many of you are currently facing and we sincerely apologize for the inconvenience this has caused to you! Our development team is working to resolve the issue as soon as possible.
— PUBG MOBILE INDIA (@PUBGMobile_IN) March 22, 2019