Manohar Parrikar: మనోహర్ పారికర్ కు భారతరత్న ఇవ్వాలంటున్న గోవా ప్రభుత్వం !
- అత్యున్నత పురస్కారం ఇవ్వాలన్న ప్రమోద్ సావంత్
- తీర్మానం చేసి పంపనున్న గోవా అసెంబ్లీ
- ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారన్న షైనీ
రక్షణ శాఖ మాజీ మంత్రి, గోవా సీఎంగా విధులు నిర్వహిస్తూ, పాంక్రియాటిక్ కేన్సర్ తో గత వారంలో మరణించిన మనోహర్ పారికర్ కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చేందుకు లాంఛనంగా చర్చలు మొదలయ్యాయని గోవా సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. పారికర్ కు భారతరత్న ఇవ్వాలన్న ఆలోచనను గోవా నూతన సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ నుంచే వచ్చిందని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నామని బీజేపీ నేత ఒకరు తెలిపారు.
గోవాకు చెందిన నాయకుడిగానే కాకుండా, భారత రక్షణమంత్రిగా విశేషమైన సేవలందించిన పారికర్, భారతరత్న పురస్కారానికి అర్హులని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, సావంత్ ఆలోచనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ నేత ఎన్సీ షైనా స్వాగతించారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన పారికర్ కు ఘనమైన నివాళి ఇవ్వాలంటే, అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడమే మార్గమని అన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మిత్రపక్షాలతో చర్చించి, వారి మద్దతుతోనే అసెంబ్లీ నుంచి సిఫార్సు చేయాలన్న ఆలోచనలో ఉన్నామని తెలిపారు.