Andhra Pradesh: జగన్ ఇంటికి వచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు.. సుదీర్ఘంగా చర్చలు!
- వెంటపెట్టుకుని వచ్చిన విజయసాయిరెడ్డి
- రాజకీయ భవిష్యత్, జిల్లా రాజకీయాలపై చర్చలు
- త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానన్న సుబ్బారాయుడు
పశ్చిమగోదావరి జిల్లా నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ఈరోజు వైసీపీ అధినేత జగన్ నివాసానికి వచ్చారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సుబ్బారాయుడిని వెంట తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్, జిల్లాలో పరిస్థితులతో పాటు పలు అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం బయటికొచ్చిన సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడారు.
'ఒక మంచి వాతావరణంలో మేమిద్దరం అన్ని విషయాలను చర్చించుకున్నాం. మా తరఫున ఆయన తరఫున ఒక అవగాహనకు వచ్చాం. ఈ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదిరింది. మా కార్యకర్తలు, నాయకులకు తెలియపరిచి వారి అభిప్రాయం మేరకు వారి సమక్షంలో నిర్ణయాన్ని ప్రకటిస్తా’ అని కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు.
సుబ్బారాయుడు ఇటీవల టీడీపీకి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, గిరిజన నాయకుడు శంకర్ నాయక్, మచిలీపట్నానికి చెందిన మాధవీలత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ కండువా కప్పిన జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.