Telangana: ‘కాంగ్రెస్’ నాకు సీటు ఇవ్వడం బహుమతి కాదు బాధ్యత: ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి

  • రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తున్నా
  • నేను చేసిన అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చూపెట్టా
  • కేంద్రంతో పోరాడతానంటున్న కేసీఆర్ ఏమైనా ఎన్టీఆరా?
కాంగ్రెస్ పార్టీ తనకు సీటు ఇవ్వడం బహుమతి కాదని, బాధ్యత అని ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో ఈరోజు ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయ కర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు టీడీపీ నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు. రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తున్నట్టు చెప్పారు.

తాను పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తున్నానని అన్నారు. తాను చేసిన అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో చూపెట్టానని, తన కంటే ఖమ్మంను ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తన ప్రత్యర్థి గురించి మాట్లాడి తన సమయం వృథా చేసుకోనని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆమె విమర్శలు చేశారు. కేంద్రంతో పోరాడతానని చెబుతున్న కేసీఆర్ ఏమైనా ఎన్టీఆరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అధికార బలం ఉంటే, తనకు కార్యకర్తల బలం ఉందని చెప్పారు. 
Telangana
Khamam
T-congress
Renuka chowdary

More Telugu News