Andhra Pradesh: తన కోసం, తన పెళ్లాంబిడ్డల కోసం కాకుండా మా వాడు ఏం చేసినా సపోర్ట్ చేస్తా: జేసీ దివాకర్ రెడ్డి
- తమ్ముడిపై ప్రేమను చాటుకున్న ఎంపీ
- ప్రజల కోసం బతుకుతున్నాం
- ప్రజలు కూడా మమ్మల్ని అంగీకరించారు
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడడం లేదు కాబట్టే ప్రజలు తమను అంగీకరిస్తున్నారని తెలిపారు. తన సోదరుడు కొన్నిసార్లు ఆవేశంతో కర్రపట్టుకుని రంగంలో దిగడం ప్రజల కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
తన సొంతానికి కానీ, తన భార్యాబిడ్డల కోసం కానీ కాకుండా ప్రజల కోసం ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా తాను మద్దతిస్తానని జేసీ అన్నారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదట్లోనే చెప్పానని, ఓ సంవత్సరం పాటు తాను కఠినంగా వ్యవహరిస్తానని, ఆ తర్వాత అంతా సాఫీగా ఉంటుందని చెప్పానని గుర్తుచేశారు. తప్పు చేసినా, అన్యాయం జరిగినా నిలదీయడం తన నైజం అని చెప్పారు. అందుకే గెలిచిన తర్వాత ఏడాదిపాటు నియోజకవర్గంలో అన్ని సమస్యలను చక్కబెట్టే క్రమంలో కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు.
అంతేగాకుండా, తాము గతంలో జగన్ ను ఎలాంటి దూషణలు చేయలేదని జేసీ బ్రదర్స్ స్పష్టం చేశారు. రాయలసీమ స్లాంగ్ లో 'నీయమ్మ' అనేది ఊతపదం అని, వైఎస్ విజయమ్మ తల్లిలాంటిదని, ఆమెను ఉద్దేశించేలా ఎలాంటి పదప్రయోగం చేయలేదని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తాము ఎప్పుడు వెళ్లినా ఇంట్లో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చేదని గుర్తుచేసుకున్నారు. తాము రాయలసీమ సంస్కృతిలో మనవళ్లను చూసి కూడా చెప్పకూడని బూతుపదం ఉపయోగిస్తామని చెబుతుండగా, దివాకర్ రెడ్డి అందుకుని 'నా మనవడ్ని నేను దొంగనాకొడకా' అంటూ పిలుస్తాను" అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.