BJP: భార్య ఒక పార్టీలో, భర్త మరో పార్టీలో ఉంటే తప్పేంటి?: పురందేశ్వరి
- ఇతర పార్టీలకు ఎందుకంత బాధ?
- అది కుటుంబ నిర్ణయం
- తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వైసీపీలో చేరాల్సివచ్చింది
బీజేపీ నేత పురందేశ్వరి ఈ ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక కుటుంబంలో భిన్న పార్టీలకు చెందిన వ్యక్తులు ఉంటే తప్పేంటో తనకు అర్థం కావడంలేదని అన్నారు.
పురందేశ్వరి బీజేపీలో ఉండగా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. భార్య ఒక పార్టీలో, భర్త మరో పార్టీలో ఉంటే ఇతరులకు కలిగే నష్టమేంటి? అని పురందేశ్వరి ప్రశ్నించారు. కుటుంబ బంధాలకు విఘాతం కలగకుండా, రాజకీయాలకు ఇబ్బంది లేని విధంగా తమ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం అని ఆమె స్పష్టం చేశారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరాల్సివచ్చిందని పురందేశ్వరి తెలిపారు.