Andhra Pradesh: పెన్షన్ పెంపు.. కనీస వయసు తగ్గింపు: టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు

  • వృద్ధాప్య పెన్షన్ కనీస వయసును 60కి తగ్గిస్తా
  • 98 లక్షల మందికి ‘పసుపు-కుంకుమ’ అందించాం
  • అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో 3.91 కోట్ల మంది ఓటర్లు ఉంటే 98 లక్షల మంది ప్రజలకు పసుపు-కుంకుమ ఇచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు అంతా టీడీపీకి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో 65 లక్షల మందికి పింఛన్లు, నిరుద్యోగ భృతి ఇస్తున్నామని సీఎం చెప్పారు. దాదాపు 45 లక్షల మంది రైతులకు అన్నదాత-సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తున్నామనీ, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని అన్నారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయలేరని జగన్ అన్నారని, అయితే జగన్ మాటలను తిప్పికొట్టేలా వాటిని అమలు చేసి చూపామని ముఖ్యమంత్రి అన్నారు. దీంతో ఇప్పుడు తానూ ఈ పథకాలను అమలు చేస్తానంటూ జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు కుట్రలకు దిగుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మళ్లీ టీడీపీకి అధికారం అప్పగిస్తే ప్రస్తుతం ఇస్తున్న రూ.2,000ల పెన్షన్ ను రూ.3,000కు పెంచుతామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు కనీస వయసును 60 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. దీంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
teleconference

More Telugu News