Andhra Pradesh: గిరిజనుడి కస్టడీ మృతి.. పోలీసులే కొట్టి చంపారంటున్న బాధిత కుటుంబం!
- ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఘటన
- శ్యామలరావు అనే గిరిజనుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గుండెపోటుతోనే చనిపోయాడంటున్న అధికారులు
గంజాయి కేసులో ఓ గిరిజనుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అనూహ్యంగా అతను పోలీసుల కస్టడీలో చనిపోవడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. పోలీసులు కొట్టిన దెబ్బలు తాళలేకే నిందితుడు చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.
విశాఖలోని నర్సీపట్నంకు చెందిన శ్యామలరావును పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సాగుకు సంబంధించి విచారించేందుకు అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ ఏమయిందో తెలియదు కానీ శ్యామలరావు ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. దీంతో అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు.
కాగా, ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ శ్యామలరావుకు గుండెనొప్పిగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకొచ్చామని తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడన్నారు. మరోవైపు పోలీసులే శ్యామలరావును కొట్టిచంపారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల దెబ్బలు తాళలేకే శ్యామలరావు చనిపోయారని ఆరోపిస్తున్నారు.