amith shah: అమిత్ షాను ఢీకొట్టడానికి రెడీ అవుతున్న శంకర్ సింగ్ వాఘేలా!
- గాంధీ నగర్ బరిలోకి బీజేపీ అభ్యర్థిగా అమిత్ షా
- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి శంకర్ సింగ్ వాఘేలా
- ఆ సీటుపైనే అందరి దృష్టి
గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ స్థానం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానం నుంచి ఈసారి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్న సంగతి విదితమే. అయితే, ఈయనపై ఆ రాష్ట్ర సీనియర్ రాజకీయ వేత్త శంకర్ సింగ్ వాఘేలా ఇప్పుడు పోటీకి దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అందరి దృష్టినీ ఇప్పుడీ స్థానం ఆకర్షిస్తోంది.
భారతీయ జనసంఘ్ తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శంకర్ సింగ్ వాఘేలా 1996లో బీజేపీలో చేరారు. ఆ తరువాత ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేసిన ఆయన, కొన్ని పరిస్థితుల కారణంగా దానిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. 1996- 97 మధ్య గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన, 2017లో 'జన వికల్ప్ మోర్చా' అనే కొత్త పార్టీని కూడా స్థాపించారు.
ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, ఈ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో అక్కడి రాజకీయం వేడెక్కింది.