Delhi: డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు, చిన్నారి సహా నలుగురి సజీవ దహనం
- ఢిల్లీ బస్సు స్టేషన్ నుంచి బయల్దేరిన బస్సు
- మరో బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం
- ఇంజిన్‌లో వ్యాపించిన మంటలు
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా నలుగురు సజీవ దహనమయ్యారు. నేడు ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్సు స్టేషన్ నుంచి బయలుదేరిన బస్సు లఖ్‌నవూకి వెళుతుండగా, లఖ్‌నవూ-ఆగ్రా రహదారిపైకి రాగానే ప్రమాదం జరిగింది. కర్హల్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేశ్ పాల్ కథనం మేరకు, ఇద్దరు డ్రైవర్లు, ఒక కండక్టర్‌తో పాటు బయల్దేరిన బస్సు ముందు వెళుతున్న మరో బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. అవి బస్సు మొత్తం వ్యాపించడంతో ఓ ప్రయాణికురాలు ఆమె బిడ్డతో పాటు డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. మరో డ్రైవర్, మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలవగా వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు రాజేశ్ పాల్ తెలిపారు.