KTR: ఢిల్లీని శాసించే శక్తిగా టీఆర్ఎస్ మారాలి: కేటీఆర్
- 16 ఎంపీ స్థానాలను అందించాలి
- కేసీఆర్‌లాంటి చేతల మనిషి దేశానికి అవసరం
- జిమ్మేదారు మనిషి కావాలి
- మోదీ అండ ఏమాత్రం లేదు
ప్రధాని మోదీ సొంత బలంతో తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, కాబట్టి టీఆర్ఎస్‌ను 16 స్థానాల్లో గెలిపిస్తే, వాటికి మరో 140 మంది ఎంపీలను జత చేస్తారని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నేడు ఆయన సిరిసిల్ల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, బీజేపీ నేతలు కీలుబొమ్మల్లా మారారని విమర్శించారు. ఎన్డీయేతో కలిసి వున్నప్పుడు చంద్రబాబు పోలవరానికి నిధులు తెచ్చుకున్నారని, తెలంగాణలో కూడా ప్రాజెక్టులు రావాలంటే 16 ఎంపీ స్థానాలు గెలవాలన్నారు.
తెలంగాణకు కేంద్ర మంత్రివర్గంలో చోటివ్వని మోదీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. దేశానికి కావల్సింది చౌకీదార్లు, టేకేదార్లు కాదని, జిమ్మేదారు మనిషి కావాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీని శాసించే శక్తిగా టీఆర్ఎస్ మారాలని, కేసీఆర్‌ను దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా సర్వేలు పేర్కొంటున్నాయన్నారు. దేశానికి కేసీఆర్‌లాంటి చేతల మనిషి కావాలన్నారు. కొత్తగా ఏర్పడిన, చిన్న రాష్ట్రానికి మోదీ అండ ఏమాత్రం లేదని కేటీఆర్ విమర్శించారు.