polavaram: ‘పోలవరం’పై కేవీపీ రామచంద్రరావు పిటిషన్ పై హైకోర్టులో వాదనలు!
- ‘కాంగ్రెస్’ ఎంపీ కేవీపీ దాఖలు చేసిన పిల్ పై వాదనలు
- ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 8 కి వాయిదా
- ఓ ప్రకటన విడుదల చేసిన కేవీపీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యతను విస్మరించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన పిల్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో బాధ్యతను కేంద్రం విస్మరించిన వైనంపై పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి గంటన్నర పాటు తమ వాదనలు వినిపించారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్రానిదేనని విభజన చట్టంలో పేర్కొన్న అంశాన్ని సవివరంగా విశదీకరిస్తూ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలంటూ, రాష్ట్ర ప్రజలపై అనవసర, అదనపు భారాన్ని మోపుతున్న కేంద్ర వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనలు జరిగాయి. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 8కి వాయిదా వేసిన విషయాన్ని కేవీపి రామచంద్రరావు ఓ ప్రకటనలో తెలిపారు.