D. Raja: మోదీ బయోపిక్ విడుదలైతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి: ఈసీకి వామపక్షాల ఫిర్యాదు
- ఏప్రిల్ 5న బయోపిక్ విడుదల
- 11 నుంచి తొలి విడత పోలింగ్
- ఓటర్లను ప్రలోభ పెడుతుందని వామపక్షాల ఆందోళన
- ఈసీ ఎలాంటి భరోసా ఇవ్వలేదన్న నేతలు
వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్ ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికల తేదీల ప్రకారం తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 11న జరుగుతుంది. దీంతో మోదీ బయోపిక్ ఓటర్లను ప్రలోభపెడుతుందని వామపక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో విడుదలను ఆపేయాలని సీపీఐ, సీపీఎం ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.
సీపీఐ నేత డి.రాజా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు నీలోత్పల్ బసు బృందం నేడు ఈసీ అధికారులను కలిసి మోదీ బయోపిక్ విడుదలను అడ్డుకోవాలని కోరారు. ఈ సినిమా విడుదలైతే త్రిపుర, పశ్చిమబెంగాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఈసీకి వివరించారు. ఈ విషయమై ఈసీ తమకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని ప్రతినిధుల బృందం నేడు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. అయితే తాము బయోపిక్ విషయమై ఈసీతో క్షుణ్ణంగా చర్చించామని, గతంలో ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రచారాన్ని నిలిపివేసిన సందర్భాలనూ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.