Anurag Singh: కష్టపడి నిర్మించుకున్న సెట్ కాలిపోవడం చూసి గుండె పగిలిపోయింది: అక్షయ్
- కీలక యుద్ధ సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది
- సెట్ అంతా కాలి బూడిదైపోయింది
- సెట్స్‌లో దాదాపు ఏడు కెమెరాలున్నాయి
- సెట్ కాలిపోవడం చూసి ఏడ్చామనే చెప్పాలి
అనురాగ్‌సింగ్ దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కేసరి’. ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ప్రముఖంగా 1897లో జరిగిన సారాగడి యుద్ధాన్ని చూపించారు. అయితే ఈ యుద్ధానికి సంబంధించిన చిత్రీకరణ విధానాన్ని వీడియోలో చూపించారు.
ఈ సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను అక్షయ్, అనురాగ్‌లు వీడియోలో పంచుకున్నారు. యుద్ధ సన్నివేశం చిత్రీకరించే సమయంలో మంటలు అలముకోవడం, సెట్ అంతా కాలిపోవడం తదితర విషయాలను వెల్లడించారు.
‘‘దాదాపు చిత్రీకరణను పూర్తిచేశాం. ఒక కీలక యుద్ధ సన్నివేశం మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. కెమెరాలన్నీ ఆన్‌లో ఉన్నాయి. సెట్స్‌లో దాదాపు ఏడు కెమెరాలు ఉన్నాయి. ఇక సన్నివేశం చిత్రీకరించడం మొదలు పెడదామనుకునే లోపు సెట్స్‌లో మంటలు చెలరేగాయి. సెట్ అంతా కాలి బూడిదై పోయింది.
అసలు ఏం జరిగిందో, ఎక్కడి నుంచి మంటలు వ్యాపించాయో అర్థం కాలేదు. సినిమా చిత్రీకరణ నిమిత్తం మహారాష్ట్రలోని వాయ్ అనే చిన్న ప్రాంతంలో నాలుగు నెలల పాటున్నాం. కష్టపడి సెట్స్‌ను రూపొందించారు. అంతకాలం అక్కడున్నాం కాబట్టి ఆ ప్రాంతంతో అనుబంధం ఏర్పడింది. సెట్ కాలిపోవడం చూసి గుండెపగిలిపోయింది. సెట్స్ అగ్నికి ఆహుతైపోవడం చూసి మేమందరం ఏడ్చామనే చెప్పాలి. ఈ విషయం గురించి నిర్మాత అయిన కరణ్‌కు చెప్పాం. ‘ఇలాంటివి మంచికే జరుగుతుంటాయిలే..’ అని ఆయన ధైర్యం చెప్పారు’’ అని అక్షయ్, అనురాగ్‌లు చెప్పుకొచ్చారు.