MLCs: టీఆర్ఎస్‌కు భారీ షాక్.. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఓటమి
- తిరుగులేదనుకున్న టీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ
- మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరికి ఘోర పరాభవం
- ఎవరికీ అందనంత దూరంలో జీవన్ రెడ్డి
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఊపు మీదున్న టీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపర్చిన ముగ్గురు అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్‌కు గట్టి పట్టున్న కరీంనగర్, నల్లగొండ ఉపాధ్యాయ, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు దారుణంగా ఓడారు. అంతేకాదు, ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేకపోవడం గమనార్హం. ఇక, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడిన పాతూరి సుధాకర్‌రెడ్డి ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్న ఆయనకు ఇది ఘోర పరాభవమేనని చెబుతున్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం అభ్యర్థి పూల రవీందర్ కూడా ఓటమి పాలయ్యారు.
కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి రఘోత్తం రెడ్డి, నల్లగొండ స్థానం నుంచి నర్సిరెడ్డి విజయం సాధించగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయం ఖాయమైంది. ప్రత్యర్థులు అందుకోలేనంత దూరంలో ఆయన ఉన్నారు. తమకు తిరుగులేదనుకున్న టీఆర్ఎష్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు షాకివ్వగా, వలసలతో కుదేలవుతున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు బూస్ట్‌లా మారాయి.