Andhra Pradesh: ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఎన్నికల సంఘం!
- పోలీసు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఫిర్యాదు
- ఇంటెలిజెన్స్ బాస్‌ను కూడా విధుల నుంచి తప్పించిన ఈసీ
- వీరికి ఎలాంటి ఎన్నికల విధులు కేటాయించవద్దని ఆదేశాలు
ఏపీ పోలీస్ బాసులకు కేంద్ర ఎన్నిక సంఘం షాక్ ఇచ్చింది. డీజీపీ ఆర్‌పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్, చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్, గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, విజయనగరం ఎస్పీ దామోదర్, అడిషనల్ సీఈవో సుజాత శర్మ, ఓఎస్‌డీ యోగానంద్‌లు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ముగ్గురు ఐపీఎస్‌లను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో పాటు శ్రీకాకుళం ఎస్పీని ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు స్థానంలో ఆయన తర్వాత సీనియర్ గా ఉన్న అధికారిని నియమించాలని ఆదేశించింది. వీరికి ఎలాంటి ఎన్నికల విధులు కేటాయించవద్దని సూచించింది.