Talasani: ఏపీ విషయంలో జాతీయ సర్వేలన్నీ చెబుతున్నదిదే: తలసాని శ్రీనివాస్ యాదవ్
- వైసీపీకి 125 నుంచి 130 అసెంబ్లీ సీట్లు ఖాయం
- 18 నుంచి 23 లోక్ సభ సీట్లలోనూ గెలుపు
- ఏపీ రాజకీయాలన్నీ కేసీఆర్ చుట్టూనే
- టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న తలసాని
ఆంధ్రప్రదేశ్ కు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 125 నుంచి 130 సీట్లు వస్తాయని, లోక్ సభ నియోజకవర్గాల్లో 18 నుంచి 23 సీట్లు ఖాయమని, జాతీయ సర్వేలన్నీ ఇదే చెబుతున్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీకి జగన్ సీఎం కావడం ఖాయమని అన్నారు.
టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్న ఆయన, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కావాలనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలపై తెలంగాణలో దాడులు చేస్తున్నారన్న పవన్ ఆరోపణలను ప్రస్తావించిన తలసాని, నిన్నటివరకూ పవన్ హైదరాబాద్ లో లేరా? అని ప్రశ్నించారు. ఎవరిపై దాడులు జరిగాయో చెప్పాలని సవాల్ విసిరారు.
తెలుగుదేశం పార్టీ నేతల ఆస్తుల్లో 80 శాతం హైదరాబాద్ లోనే ఉన్నాయని, తామే బెదిరింపులకు దిగేవారిమైతే ప్రశాంతంగా వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అన్నీ కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయని, కేసీఆర్ ను తలచుకోకుండా ఒక్క క్షణం కూడా చంద్రబాబు ఉండలేకపోతున్నారని అన్నారు.