sp rahuldev sarma: కేసు దర్యాప్తు కీలక దశలో ఎస్పీ బదిలీ సరికాదు: చంద్రబాబు
- కడప ఎస్పీపై వేటుపై సీఎం అసంతృప్తి
- హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌కు ఆదేశం
- ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసే అధికారం ఈసీకి లేదని వ్యాఖ్య
కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్‌దేవ్‌శర్మపై ఎన్నికల కమిషన్ వేటు వేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే.
రాజకీయ హత్యగా ఆరోపణలున్న నేపథ్యంలో పోలీసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. అటువంటి కేసు విచారణ కీలక దశలో ఉండగా ఈసీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిఘా విభాగం బాస్ ఎ.బి.వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీపై ఈసీ వేటు వేయడంపైనా బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ నిర్ణయంపై లంచ్‌మోషన్‌లో పిటిషన్ దాఖలు చేయాలని పార్టీ బాధ్యులను ఆదేశించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నిర్ణయం తీసుకుందని, సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ తీసుకోలేదని ఆరోపించారు. ఎన్నికల విధులతో సంబంధం లేని నిఘా విభాగం బాస్‌పై వేటు వేసే అధికారం ఈసీకి లేదని అన్నారు.