Andhra Pradesh: పోలీసులు, అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు పార్టీ వ్యవస్థలా వాడుకుంటున్నారు!: బీజేపీ నేత జీవీఎల్ ఫైర్
- తాజాగా ఈసీ నిర్ణయం బాబుకు ఇబ్బందికరమే
- ఇది అంతం కాదు.. ఆరంభం కావాలి
- ఏపీ ప్రజలు టీడీపీ సైకిల్ ను అటకెక్కిస్తారు
ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీ వ్యవస్థలా వాడుకుంటున్నారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో పాటు కీలక అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం టీడీపీకి ఇబ్బందికరమేనని వ్యాఖ్యానించారు. ఇది అంతం కాకూడదనీ, ఆరంభం కావాలని అన్నారు. ఈసీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే, ఏపీ ప్రజలు సైకిల్ ను అటకెక్కించి మిగతా పనిని పూర్తిచేస్తారని స్పష్టం చేశారు.
ఈరోజు ట్విట్టర్ లో జీవీఎల్ స్పందిస్తూ..‘పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని పార్టీ వ్యవస్థలా వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ఇబ్బందికరమే. ఇది "అంతం కాదు ఆరంభం" మాత్రమే కావాలి. ఎలక్షన్ కమిషన్ తన వంతు రాజ్యాంగ బద్ధ బాధ్యత వహిస్తే ప్రజలు సైకిల్ ను అటకెక్కించి మిగతాది పూర్తి చేస్తారు. @ncbn’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ట్వీట్ కు జతచేశారు.