Andhra Pradesh: ఈసీ నిబంధనల మేరకు వెళితే ఓకే.. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఊరుకోం!: సీఎం చంద్రబాబు హెచ్చరిక
- ఎందుకు బదిలీ చేశారో ఇంకా చెప్పట్లేదు
- విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే బదిలీచేశారు
- కర్నూలులో మీడియాతో టీడీపీ అధినేత
ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులను ఏ కారణంతో బదిలీ చేశారన్న విషయమై ఈసీ వర్గాలు ఇంకా సమాధానం చెప్పలేకపోతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే ఓ పద్ధతి ప్రకారం బదిలీ చేయాలని వ్యాఖ్యానించారు. కానీ ఓ ఆర్థిక నేరస్తుడైన వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్య తీసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. కర్నూలు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు.
విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే పోలీస్ అధికారులను బదిలీ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మోదీ, జగన్, కేసీఆర్ ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరావుకు శాంతిభద్రతల నిర్వహణతో సంబంధం లేదని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి భద్రతను కూడా ఆయన చూసుకుంటారన్నారు. ఇంటెలిజెన్స్ విభాగం అన్నది ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ఇలా తమ పరిధిలో లేని విషయంలో కూడా ఈసీ జోక్యం చేసుకోవడం నిజంగా బాధాకరమని వ్యాఖ్యానించారు.
తాను ఏపీలో 24 గంటలు తిరుగుతూ ఉంటాననీ, తనపై గతంలో దాడి కూడా జరిగిందని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వంపై తాము చాలాకాలంగా పోరాడుతున్నామని చెప్పారు. సీబీఐ, ఆర్బీఐ, ఈడీ సహా పలు ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టించిందని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా, పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
నిబంధనల మేరకు ఈసీ అధికారులు ముందుకెళితే తమకు అభ్యంతరం లేదనీ, అయితే ఏకపక్షంగా వెళ్లాలనుకుంటే మాత్రం ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.