Bhimavaram: క్లాస్ మేట్ కదా అని భర్తకు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తే.. వేధించిన యువకుడు!
- భీమవరం యువతికి ఐదేళ్ల క్రితం వివాహం
- భర్త వద్ద క్లాస్ మేట్ ను ఉద్యోగంలో పెట్టించిన యువతి
- ఫోటోలు దొంగిలించి మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్
తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని బతిమాలిన క్లాస్ మేట్ కు, తన భర్త వద్దే ఉద్యోగం ఇప్పించిన ఓ యువతిని వేధింపులకు గురిచేసిన దుర్మార్గుడి ఉదంతం ఇది. బాధితురాలు, భీమవరం పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం, పట్టణ పరిధిలోని మెంటేవారితోటకు చెందిన యువతికి ఐదు సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన యువకుడితో వివాహం కాగా, వారు సేలంలో కాపురం ఉంటున్నారు.
గతంలో యువతితో చదువుకున్న సుధాకర్ అనే వ్యక్తి, ఉద్యోగం ఏదైనా చూడాలని బతిమాలడంతో, భర్త వద్ద పనిలో పెట్టించిందామె. ఒకరోజు తన ల్యాప్ టాప్ పాడైపోయిందని భాధితురాలి వద్దకు వచ్చిన సుధాకర్, ఆమె ల్యాప్ టాప్ తీసుకుని, అందులోని ఆమె చిత్రాలను దొంగిలించాడు. ఆపై వాటిని మార్ఫింగ్ చేసి, తన కోరిక తీర్చాలని వేధింపులు ప్రారంభించాడు. తనకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే ఈ ఫోటోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరింపులకు దిగాడు. సుధాకర్ వేధింపులు పెరిగిపోవడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేశామని, విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.