Andhra Pradesh: ఓట్ల దొంగలపై ఈసీ చర్యలెందుకు తీసుకోలేదు.. ఏపీలో అరాచకాలు చేయాలనుకుంటున్నారు!: సీఎం చంద్రబాబు

  • వైసీపీ బెదిరింపులపై ఈసీ చర్యలు తీసుకోలేదు
  • ఏపీలో 9 లక్షల ఓట్ల తొలగింపునకు యత్నించారు
  • కర్నూలులో మీడియాతో టీడీపీ అధినేత చంద్రబాబు

‘ఏపీలో మేమే అధికారంలోకి వస్తాం.. మీ మీద చర్యలు తీసుకుంటాం’ అని ప్రతిపక్షాలు అధికారులను బెదిరిస్తున్నప్పుడు ఎన్నికల సంఘం(ఈసీ) ఏం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తున్న ఈసీ అధికారులు, టీడీపీ నేతల ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో కేసీఆర్ 25 లక్షల ఓట్లను తీసేస్తే, అదే తరహాలో ఏపీలో 9 లక్షల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత మాట్లాడారు.

కానీ తాము అప్రమత్తం కావడంతో పాటు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు. దాదాపు 85 శాతం నిజమైన ఓట్లను వైసీపీ నేతలు తొలగించారనీ, రెడ్ హ్యాండెడ్ గా ఓట్ల దొంగలు పట్టుబడ్డారని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఓట్ల దొంగలపై ఎన్నికల సంఘం ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఏపీలో వైసీపీ-బీజేపీ పొత్తు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల స్పందిస్తూ..  తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ తమకు సపోర్ట్ చేస్తోందని నిన్న చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

అదే క్రమంలో ఈసీని ఉపయోగించుకుని వైసీపీ అరాచకాలు చేయాలనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యులే సాక్ష్యాధారాలు లేకుండా చేశారని విమర్శించారు.

వాళ్లే ఈరోజు కోర్టుకు వెళ్లి ‘సిట్ విచారణను బయటపెట్టకూడదు, సీబీఐ విచారణకు ఆదేశించాలి’ అని కోరుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కడప ఎస్పీని బదిలీ చేసి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఈసీ అధికారులను ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ ఆడింది ఆట పాడింది పాటగా మారిందన్నారు. సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు.

  • Loading...

More Telugu News