amedhi: తండ్రి ఇందిర కుటుంబ సన్నిహితుడు... కొడుకు రాహుల్‌గాంధీ ప్రత్యర్థి
- అమేథీలో అనుచరునితోనే తలపడుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు
- స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన రషీద్
- ముస్లిం ఓట్లే గెలిపిస్తాయని ధీమా
అమేథీలో రాహుల్‌గాంధీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు బీజేపీ ప్రత్యర్థి స్మృతి ఇరానీతోపాటు, తమ కుటుంబ సన్నిహితుడి నుంచే పోటీ ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు తమ కుటుంబానికి సన్నిహితుడు, పలు ఎన్నికల్లో నానమ్మ, నాన్న, అమ్మ నామినేషన్లను సమర్థిస్తూ సంతకాలు చేసిన హాజీ సుల్తాన్‌ఖాన్ కొడుకు హాజీ హరూన్ రషీద్ అమేథీలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమపట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని తట్టుకోలేక పార్టీ నుంచి పూర్తిగా వైదొలిగానని, ఎన్నికల బరిలో నిలిచి తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నానని రషీద్ చెబుతున్నారు.
‘అమేథీలో రాహుల్‌ను ఢీకొట్టగలనని అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించగా నియోజకవర్గంలో 6.5 లక్షల ముస్లిం ఓటర్లు ఉన్నారని, వారే తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు హాజీ సుల్తాన్‌ఖాన్, హాజీ హరూన్ రషీద్‌లు రాజీవ్ కుటుంబానికి సన్నిహితులు. ఇందిర, రాజీవ్, సోనియాగాంధీ నామినేషన్ల పత్రాలపై హాజీసుల్తాన్‌ఖాన్ సంతకాలు చేసేవారు. మరి ఎక్కడ తేడా వచ్చిందో రషీద్ ప్రత్యర్థిగా మారారు.