YSRCP: ఓ అవ్వా, ఎర్రచీర కట్టుకున్న అవ్వా.. మన గుర్తు ‘ఫ్యాన్’: వైఎస్ జగన్ ఓట్ల అభ్యర్థన
- విశాఖపట్టణం జిల్లాలో జగన్ ఎన్నికల ప్రచారం
- తల్లీ, అక్కా, అన్నా.. ‘ఫ్యాన్’ గుర్తు’కే ఓటెయ్యండి
- చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ప్రజలు ఆలోచించాలి
‘ఓ అవ్వా, ఎర్రచీర కట్టుకున్న అవ్వా పట్టుచీర కట్టుకున్న అవ్వా మన గుర్తు ‘ఫ్యాన్’’ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎన్నికల గుర్తును చెబుతూ ఓట్లు అభ్యర్థించారు. విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ‘తల్లీ, అక్కా, అన్నా.. ‘ఫ్యాన్’ గుర్తు’ అంటూ తమ పార్టీ ఎన్నికల సింబల్ అయిన ‘ఫ్యాన్’ ని ప్రజలకు చూపిస్తూ తమకు ఓట్లు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పాదయాత్రలో తనను కలిసిన రైతులు చెప్పిన సమస్యలను మర్చిపోలేదని అన్నారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలో 9 నెలలుగా జీతాల్లేవని, చెరకు రైతుకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు. వరాహ, తాండవ నదుల్లో ఇసుక ఏ మాత్రం లేకుండా దోచేస్తున్నారని, ఇసుక ఎవరికీ ఫ్రీగా ఇవ్వడం లేదని ఇక్కడి వారు వాపోయారని, లారీ ఇసుక రూ.40 వేలకు అమ్ముకుంటున్నారని తన దృష్టికి తెచ్చారని అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ప్రజలు ఆలోచించాలని, ఆయన చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు గుర్తుచేసుకోవాలని పోరారు.