data: ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
- డేటా చోరీ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు
- ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి, ఆధార్ అధికారులకు కూడా నోటీసులు
- తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా
ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి, ఆధార్ సంస్థ కేంద్ర సీఈవో, ఆధార్ ఏపీ రిజిస్ట్రార్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈరోజు డేటా చోరీ కేసును హైకోర్టు విచారించింది. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల పరిధిలోకి రాకపోయినా.. తనకు నోటీసులు ఇచ్చారని పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి మాత్రం... కీలకమైన ఎన్నికల డేటా, ఆధార్ డేటా చోరీకి గురైందని, సంబంధిత కార్యాలయం హైదరాబాదులో ఉన్నందున తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి, ఆధార్ సంస్థ కేంద్ర సీఈవో, ఆధార్ ఏపీ రిజిస్ట్రార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది.