BJP: బీజేపీ కంటే కేఏ పాల్పైనే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు: కుటుంబరావు
- డిపాజిట్లు వస్తే రూ.5 లక్షలు
- కన్నా డిపాజిట్ సాధిస్తే రూ.10 లక్షలు
- ఎమ్మెల్యేగా గెలిస్తే రూ.15 లక్షలు
- చచ్చిపోయిన పార్టీలో ఏముంటుంది?
బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయిందని, ఆ పార్టీపై కంటే కేఏ పాల్పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ చచ్చిపోయిందని, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు వస్తే సొంత డబ్బు నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తానని సవాల్ విసిరారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిపాజిట్ సాధిస్తే రూ.10 లక్షలు ఇస్తానని, ఆ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచినా రూ.15 లక్షలు ఇస్తానని ప్రకటించారు. తానేమీ బెట్టింగ్ చేయట్లేదని వాళ్ల స్థాయిని చెబుతున్నానని కుటుంబరావు పేర్కొన్నారు. చచ్చిపోయిన పార్టీలో ఏముంటుందని ప్రశ్నించారు. తన డబ్బులు ఎటూ పోవనే నమ్మకంతోనే సవాల్ చేస్తున్నట్టు కుటుంబరావు పేర్కొన్నారు. టీడీపీకి 125-135 సీట్లు వస్తాయని, వైసీపీ 25-30 సీట్లతో సరిపెట్టుకుంటుందని కుటుంబరావు జోస్యం చెప్పారు.