Suryapet District: కాపీ కొట్టడానికి టెన్త్ విద్యార్థినికి సహకరించి.. ఆపై అత్యాచారం చేసిన ఇన్విజిలేటర్... సూర్యాపేటలో కలకలం!
- సూర్యాపేటలో టెన్త్ రాస్తున్న బాలిక
- చూసి రాసేందుకు సహకరించిన టీచర్
- పెద్దమనుషులతో పంచాయతీ
- కేసు పెట్టని బాలిక కుటుంబీకులు
పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, కాపీలు కొట్టేందుకు సహకరించిన ఓ ఇన్విజిలేటర్, ఆపై అమ్మాయిని ఊరి బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన సూర్యాపేటలో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి అరవై అడుగుల రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ బాలిక టెన్త్ పరీక్షలు రాస్తోంది. మండల పరిధిలోని ఓ తండాలో టీచర్ గా పని చేస్తున్న 50 ఏళ్లకు పైబడిన వ్యక్తి, ఈ పాఠశాలకు ఇన్విజిలేటర్ గా వచ్చాడు.
ఆ బాలిక చూసి రాసేందుకు సహకరించిన టీచర్, పరీక్ష తరువాత బయట వెయిట్ చేయాలని చెప్పి, ఆమెను తన టూ వీలర్ పై ఎక్కించుకుని, పొదల్లోకి తీసుకెళ్లి, దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఆపై బాలిక ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబీకులకు చెప్పగా, వారు 100 నంబర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో పోలీసులు సదరు కామాంధుడిని స్టేషన్ కు తరలించగా, ఆయన తరఫున పెద్ద మనుషులు రంగంలోకి దిగి బాలిక బంధువులకు నచ్చజెప్పి, డబ్బు ఇచ్చినట్టు తెలుస్తోంది. అత్యాచారం విషయమై ఫిర్యాదు చేయాలని తాము అడిగినా, బాలిక కుటుంబ సభ్యులు ముందుకు రాలేదని సూర్యాపేట సీఐ శివశంకర్ వ్యాఖ్యానించారు.