Satilite: భారత్ 'అంతరిక్ష యుద్ధం'పై అమెరికా హెచ్చరికలు!
- అంతరిక్షంలో గందరగోళం సృష్టించవద్దు
- శిథిలాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్న అమెరికా
- ఆ సమస్య లేనే లేదన్న భారత్
భూ ఉపరితలానికి దాదాపు 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లైవ్ శాటిలైట్ ను విజయవంతంగా ధ్వంసం వేయడం ద్వారా 'అంతరిక్ష యుద్ధం' చేయగల సత్తా ఉన్న అమెరికా, రష్యా, చైనాలతో సమానంగా ఇండియా నిలిచిన వేళ, అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇండియా మాదిరిగా యాంటీ శాటిలైట్ వెపన్స్ ను వాడుతూ అంతరిక్షంలో గందరగోళం సృష్టించవద్దని యూఎస్ తాత్కాలిక రక్షణ మంత్రి పాట్రిక్ షనాహన్ వ్యాఖ్యానించారు.
ధ్వంసమైన శాటిలైట్ల శకలాల విషయమై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. "నేను చెప్పేదేంటంటే... మనమంతా అంతరిక్షంలో భాగంగానే ఉన్నాము. దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ కార్యకలాపాలను అంతరిక్షంలో సాగించుకునే అవకాశాలు ఉండాలి" అన్నారు.
ఇండియా ప్రయోగం తరువాత అంతరిక్షంలో మిగిలిన శాటిలైట్ శకలాల గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఈ పరీక్షను తాము అధ్యయనం చేస్తున్నామని, ఎవరికీ అంతరిక్షాన్ని అస్థిరపరిచే హక్కు లేదని అన్నారు. యాంటీ శాటిలైట్ పరీక్షలతో శకలాల సమస్యను పెంచవద్దని అన్నారు. కాగా, శాటిలైట్ శకలాల సమస్య ఎంతమాత్రమూ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.